15/2
200)
ఓయ్! ఏమనుకుంటున్నావ్ నీకు నువ్వు..?!
Michel Jackson వా, సినిమా Hero వా..
నీ గుండు గుమ్మడికాయ..
గుండ్రని ముక్కు దొండకాయ..
గుబురు మీసము గొంగళి పురుగు..
చిట్టి కళ్ళు చిల్లు గారెలు..
సొట్ట బుగ్గలు ఎండిన వడియాలు..
పొట్లకాయ పొడుగు..
బజ్జి లాంటి చిన్ని బొజ్జ..
కనిపిస్తావు కాకరకాయలా..
అయినా ముద్దొస్తావు ఎలా...??!!
మనసులో మారాం చేస్తావు ఎందుకిలా..??!!
నీ మనసు వెన్నె పుస..
నీ పలుకులు పంచదార చిలకలు..
నీ అనురాగం అరటికాయ ఆవడ..
నీ ఆప్యాయత ఆవకాయ..
నీ ఆశ ఉల్లిపాయ దోశ..
నీ కౌగిలి చెక్కెర పొంగలి..
ఇలా నీలో చూస్తున్నా పంచ భక్ష పరమాన్నాలు..
అరటాకు లేకుండా ఆరగించడం ఎలా..?????
Moral : అందం కాదు ఆధరించే మనసు, అందరు మెచ్చే ఆనందం ముఖ్యం ప్రతి మనిషికి...
12/2
199)
నిశిది రాత్రిలో వెన్నెలవయినావు, చీకటి కన్నుల వేలుగువయినావు..
మనసు కోటలో అడుగిడినావు, వెల్లే దారి తెలియదన్నావు..
మనసుకు గాయం చేసినావు, మాటలతో మురిపించినావు..
స్నేహ హస్తాన్ని అందించినావు, మరణంతోనే మరుపన్నావు..
మరణించినా మరచిపోలేని ప్రేమను నేను..!!
12/2
198)
నిన్ను నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎన్నడూ మరువకు..
లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి సముద్రంలోనే నిలవకు..
కెరటాలకు భయపడి నావ తీరం చేరదు, లక్యమే దాని తుది నిర్ణయము..
ఆహారాన్ని చేర్చటమే చీమ లక్ష్యము, పడుతూ లేస్తూ పూర్తి చేస్తుంది ఎప్పుడు...
విష సర్పాలనే మైమరపించే మొగలిరేకువై నిర్భయంగా ముందుకు నడువు..
రేపంటే చింత లేదు, నేడు సవ్యంగా గడిస్తే చాలు అనుకుంటూ లక్ష్యానికై ప్రయత్నిచు..
గెలుపు ఓటమిలకు ఎన్నడూ భయపడకు, లక్ష్య సాధనే నీ తుది గెలుపు...!!
11/2
197)
'మధు'ర భావాల మణి హారాన్ని అందించాను నీకు నా కవితలుగా..
గాలిలా మర్చి అందించాను నా 'మధు'రమైన ప్రేమను నీకు ఊపిరిగా..
మమతల కోవేలనే కట్టినాను నీ 'మధు'ర జ్ఞాపకాలతో..
మరణమే లేని 'మధు'రమైన ఆత్మ బంధువునయినాను...
మరణించినా మరు జన్మలో 'మధు'రమైన జీవితాన్ని అందిస్తాను..
ఓ 'మధు'ర హృదయమా..!! ప్రేమ కానుకగా ఇంతకంటే నేనేమి ఇవ్వగలను..?!!
Happy Valentine's day...
11/2
196)
గాలిలా సెలఏరులా చేరినావు నన్ను ఎందుకిలా..
తీయగా సడి చెయ్యక వాలినావు పక్షిలా..
పువ్వులా పొడరిల్లులా చేరుకున్నావు నన్నెలా..
నింగిలా నీలి మబ్బులా వర్షించావు ప్రేమగా..
తీగలా విరిసే మొగ్గలా నిన్ను చేరే మార్గము చెప్పవా..??!!
9/2
195)
గోధూళి వేల గోరంత దీపం పెట్టి కొండంత ఆశతో వేచి ఉన్నాను,
గోగు పువ్వు పలకరించి గోరింటాకు చేతికిచ్చి పెట్టుకోమంది..
గోరింట రంగును పూయించే గోపయ్య చెంత చేరితే గోరింటతో పనేముంటుంది అంటే,
గోగుపువ్వు వింతగా చూసి చిన్నగా కుల్లుకుంది..!!
9/2
194)
అమ్మ ఓడినే ప్రపంచం అనుకుంటుంది పసి వయసు..
ప్రేమ ఓడినే ప్రపంచం అనుకుంటుంది ప్రతి మనసు..
9/2
193)
కష్టాల కడలి ఒడ్డున ఇసుకతో కట్టినాను ఆశల సౌధాన్ని..
కడలి అలలు తాకుతాయేమో అని అరచేయిని అడ్డుపెట్టినాను..
చేయిలో చేయి వేసి నా ఆశలను నిలపెడతావో,
అలల అలజడితో అలిసిన అరచేయిని అలాగే వదిలేస్తావో..??!!
9/2
192)
గతంలో గతుకులు ఉన్నా గమ్యం ముందుంటుంది..
ముళ్ళ బాటకు భయపడకుంటే పూలబాట నీదవుతుంది..
మిత్రులే కదా అని నీ ప్రేమను తెలుపకు పది మందికి..
తెర వెనక గేలి చేసే తెలియని శత్రువులుంటారు నీ వెంటే మరి..
మనసులోని ప్రేమని, కోట్ల కొలది ధనాన్ని దాచకు..
దహించివేస్తుంది తీయగా తెలియని విధంగా..
కోరుకున్న మనసుకు కోటి కానుకలు ఇచ్చినా వ్యర్థము..
కొండంత ప్రేమను కొంగున ముడి కడితేనే అర్థము..
కోటి ఆశలతో ఎదురుచూసే ప్రేమ పక్షుల పసందైన రోజు ప్రేమికుల రోజు....
Happy Valentin's day.....
8/2
191)
నా మనసుకు సొంతమైన నీవు వస్తావని
వెండి వెన్నెలలో వేచి ఉన్న నన్ను చూసి జాబిలమ్మ వెక్కిరించింది..
నీ మనసులో నేనున్నానని నా కొరకు వేచి ఉన్నవని చెప్పినా
చుక్కలన్నిటినీ పోగుచేసి మరీ నన్ను గేలి చేసింది..
నీ మనసుకు నేను సొంతమని,
నేనున్నాను ఎప్పటికి నీ తోడుగా అని నీవంటే,
నా కోసమే వేచి ఉన్నావని తెలిసిన జాబిల్లి
మబ్బుల చాటున దాక్కుంది కొంచం అసూయతో..
మనలోని ప్రేమను చూసి వర్షించాయి మబ్బులు ఆనందంతో..
అది చూసి చుక్కలు కూడా జారుకున్నాయి నెమ్మదిగా నిట్టూరుస్తూ...
7/2
190)
పంచవన్నెల కోక కట్టి పలకరించింది సీతాకోక చిలక..
'తెల్ల' చీర కట్టింది నీ చల్లనైన మదిని కొల్లకొట్టటానికి..
'పచ్చ' చీర కట్టింది వెచ్చని నీ ఒడిలో చేర్చుకోవాలని..
'ఎర్ర' చీర కట్టింది ప్రేమతో నీ హృదయాన్ని హత్తుకోవాలని..
'నీలం' చీర కట్టింది నింగి నేల సాక్షిగా నీలో కలవాలని..
'పసుపు' చీర కట్టింది పవిత్రమైన మూడు ముళ్ళు నీ చేత కట్టించుకోవాలని..
పంచవన్నెల చీర కట్టి పసిడి వన్నెతో పులకరించింది ఆ సిగ్గు మొలక..
6/2
189)
ప్రేమించకు ప్రేమను నిన్ను ప్రేమించేవరకు..
నిన్ను ప్రేమించిన ప్రేమను ప్రేమించు
నిన్ను తప్ప ఇంకొకరిని పెమించలేనంతగా...
6/2
188)
రంగులేని నీటి బిందువును తాకిన అరుణ కిరణం వలె నీ వస్తే,
ఇంద్రదనస్సు లోని రంగుల ప్రపంచం నా సొంతమే కదా..!!
కన్నీటితో తడిసిన నా కనులకు కాటుకవై నీ వస్తే,
కలువకనుల కమనీయమైన మోము నా సొంతమే కదా..!!
మొగ్గతోడిగిన పూతోటలో మంచు బిందువువై నీ వస్తే,
విరపూసే పూతోట వలె వికసించిన జీవితం నా సొంతమే కదా..!!
నీవు నా సొంతం అనే మాట నాకిస్తే,
ఇలలో స్వర్గం మన సొంతమే కదా..!!
6/2
187)
కలిసి మాట్లాడుకున్న పలుకులెన్నో
కలవకుండా ఆడుకున్న ఊసులెన్నొ
కోటి ఆశలతో కలిసి వేసిన అడుగులెన్నో
వేయాల్సిన ఆ ఏడడుగులు మిగిలే ఉన్నాయి..!!
పగలే వెన్నెలగా మార్చిన ఆ పలుకులను
నే రాయలేను ఇసుకలో..
రాయిగా మారింది నా హృదయమే అంటే
దాచుకున్న నా ప్రేమను ఆ రాతి మీది గీతలంటాను...!!
5/2
186)
స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నా..
ఆ ప్రేమ ఎంతో మధురం అనుకున్నా..
అందులోని వేదనను తెలుసుకున్నా..
తీరని ఆశల వెనక నడుస్తున్నా..
మమకారంతో మనసులో దాచుకున్నా..
రగిలే జ్వాలకు ఆహుతి అవుతున్నా..
నిన్ను కదిలించలేని నా ప్రేమకు,
నా స్వప్నంలోనే స్థానం కల్పిస్తున్నా...!!!
5 /2
185
నా కంటిలో కన్నీరే చేరితే,
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి..
నవ్వుని పులుముకొని నవ్వుతున్నాను నలుగురిలో
కరుణించని నీ మనసుకు కనిపించకుండా
కారుతున్నది కన్నీరు ఆ నవ్వు చాటున..
కలుగుతున్నది మదిలోన కలవరము..
కనిపించదు కదా కలిసిపోయే మార్గము..
ఉరడిస్తున్నాను నా మనసును ఊహలతో నేడు..
కలలో నీ రూపమే కదలాడుతున్నది ప్రతి రోజు..
నిజ రూపు కనపడక కొట్టుకుంటున్నది నా మనసు,
అది నీ చిత్రాన్ని గీయాలనుకుంటున్నదని తెలుసు,
రంగులు చేతపట్టి గీయలనుకుంటే,
కన్నీటి పొరలు అడ్డుకుంటున్నాయి చూడు...!!!
3 /2
184
ఉరుకుల పరుగుల జీవితంలో మనసు మాటకు విలువేమున్నది..
యాంత్రికమైన జీవితానికి మనసు మమతలతో పనేమున్నది..
Tv, Mobile తోడుగా ఉంటే మనిషికి మనిషి అవసరమేమున్నది..
Internet వల్ల ప్రపంచంలో అందరితో touch ఉన్నది,
కాని, పక్కింట్లో ఏమి జరుగుతుందో తెలియకున్నది..
ఏ channel లో ఏ program వస్తుందో తెలుసుంది,
కాని, తల్లి తండ్రులను క్షేమ సమాచారం తెలుసుకునే సమయం కరువవుతున్నది..
sms ల జోరు పెరిగిన కొలది పలుకే బంగారమవుతున్నది..
పక్కపక్కనే ఉన్నా కనిపించని దూరం పెరుగుతున్నది..
కృత్రిమ వెలుగులో రేయి పగలు తేడా లేకున్నది..
కోటి ఆశలతో మొదలవుతున్న రోజు కొన్ని గంటలలోనే ముగుస్తున్నది..
పరుగులు పెట్టె ఈ జీవితానికి అలవాటు పడినప్పుడు మరణించి లభామేమున్నది...???
'అ'నురాగముతో నిండిన నా మనసు
'ఆ'నందంగా నిన్ను చేరుతానంది
'ఇ'లలో స్వర్గం నీతోనే అంది
'ఈ'లవేస్తూ పాటపాడే నిన్ను మర్చిపోనంది
'ఉ'న్నాను అంది నీ హృదయ సవ్వడిలో
'ఊ'యల ఊగుతున్నది నీ ఊసులతో
'ఋ'ణపడి ఉన్నాను అంది అన్నివిధాలా
'ఎ'టుచూసినా నీ తలపులే అంది
'ఏ' జన్మలోనూ నిన్ను వీడను అంది
'ఐ'క్యమవుతానంది నీ మదిలో
'ఒ'దిగి పోతానంది నీ ఒడిలో
'ఓ'దార్పు కోరుకుంటుంది ఈ ఒంటరి మనసు
'ఔ'రా నా మాట విను అంటుంది
'అం'దమైన నా మనసు..
అః అని ఆశ్చర్యపోకు ప్రియతమా, ముమ్మాటికీ ఇది నిజము అని నమ్ము......!!!!
2/2
182)
పేరు పేరున పిలిచి పెంచుకున్నాను ప్రేమను,
పెను మార్పు కొరకు పేరాశ పడ్డాను
ఆశ కాదు అది ఆరు జన్మల స్వాశ ఘోష,
ఏ జన్మ బంధమో అది ఈ జన్మకు కూడా మిగిలేవుంది,
మరు జన్మలో అది తీరుతుందని తెలిసి,
పరలోక యాత్రకై మార్గము వెతకలేను,
పరవశించిపోయే రోజు వస్తుందని ప్రతిరోజు ప్రయత్నిస్తాను..
1/2
181)
కలలో విహరిస్తావు,
కోరుకున్నది కావాలంటావు,
కటిక నేలపై పువ్వులు పూయిస్తావు,
బండరాయికైనా నవ్వు తెప్పిస్తావు,
మనసులో పెట్టుకుంటావు,
మాములుగా మాట్లాడతావు,
కాదు పొమ్మని పోట్లాడితే,
పట్టుకొని బుజ్జగిస్తావు,
ఆగిపోయిన కన్నీరుకు ఆజ్యం పోస్తావు,
మూగబోయిన భావాలను తట్టి లేపుతావు,
నువ్వు నా కథలో కథానయకుడివా (hero) లేక ప్రతినాయకుడివా (villan)..??!!
31/1
180)
జీవితం అనేది కష్ట సుఖాల సంఘమం..
ఒకరు నేర్పితే తెలియనిది జీవితం నేర్పుతుంది..
ఆ జీవితం నాకు నేర్పింది,
దేనికి ఎదురు చూడవద్దని,
ముందుకు సాగిపొమ్మని..
ఎవరిమీదా ఆధారపడవద్దని,
ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని..
నీకు నువ్వే తోడు అని,
ఎదుటివారికి నీడగా ఉండమని..
మంచినెన్నడు మరవరాదని,
చెడును వెంట పెట్టుకోవద్దని..
ఎదుటివారి తప్పును ఎంచవద్దని,
నీ తప్పును కప్పిపుచ్చవద్దని..
సుఖ దుఖాలను సమానంగా చూడమని,
గర్వాన్ని దరి చేరనియవద్దని..
ఈర్ష్యా ద్వేషాలు నీకు శత్రువులని,
నీ చిరునవ్వులే నీకు మిత్రులని..
మంచివాడు మోసం చేయడని,
మోసం చేసేవాడికి మంచి కనపడదని..
నీది కాని దానికి అసువులు బాయవద్దని,
అందిన దానితో సంతృప్తి పొందుమని..
నలుగురిలో ఒంటరిగా మిగలోద్దని,
ఒంటరిగా నలుగురి మెప్పును పొందమని..
సంతోషాన్ని ఎన్నడు వెతకవద్దని,
వెతికే సంతోషం దుఖాన్ని మిగిలిస్తుందని..!!
30/1
179)
ఋతువులలో ముక్యమైనది వసంత ఋతువు..
ఎండిన కొమ్మ చిగురించును, చిరు ఆశలు కురిపించును..
చిరు ఆశలే చిరు దీపమై వెలుగును అందించును..
అమావాస్య వీడిన చంద్రుడిలా నేలవంకవై వస్తావని,
చిగురించే ఆశలో నేనున్నాను..
ఆశ నిరాశాలకు అలవాటుపడినాను..
30/1
178)
వినయంగా వేడుకున్నాను విగ్నేశ్వరుడిని
వివేకంతో కోరుకున్నాను వెంకటేశ్వరుడిని
మనసుతో మన్నించమన్నాను మహేశ్వరుడిని
వేదనతో విన్నవించాను విష్ణు మూర్తికి,
బ్రమను వీడి మరీ బ్రాతిమాలినాను బ్రహ్మని,
అమాయకంగా ఆరాధించినాను అష్ట లక్ష్మిని,
అన్ని విధాలా విసిగించాను ఆ భగవంతుడిని..
అందుకే నిన్ను నాకు అందించాడు..
ఇంతటితో త్రుప్తిపడమన్నాడు..
29//1
177)
my question:
ఒక పక్షి రోజు నది ఒడ్డున వుండేది,
ఆ పక్షి నదిలోని చేపను ప్రేమించింది,
చేప కూడా పక్షిని ఘాడంగా ప్రేమించింది,
ఆ పక్షి నదిలోకి వెళ్ళలేదు,
చేప బయటికి రాలేదు.
కాని వాటిని ఎలా కలపాలి..???
My answer:
ఇద్దరినీ కలపటం కుదరదు..
ఎందుకంటే వాటి మద్య ఉన్నది ఆకర్షణ.
సహజమైన ప్రేమ కాదు...
actly love has no boundaries. it happens without any reason.
కొంగ river దగ్గర తను survive అవటానికి food కొరకు ఉంటుంది. కొంగకు అది అవసరం.
ఆ అవసరం ప్రేమగా మారినా చేపతో కలిసి ఉండటం కుదరదు.
కాదు అని కలిసి ఉండాల్సిందే అని పట్టు పడితే తప్పకుండా ఒకరు ప్రాణం విడవాల్సిందే.
So, ఒకే జాతి మద్య పుట్టే ప్రేమను ఎలాగైనా గెలవవచ్చు.
రెండు వేరు జాతుల మద్య ప్రేమ ఫలించదు.
hey friends, dont think this story is related to me. just I want to tell you the fact...
maximum love marriages are getting failure because of this reason... so boys and girls be alert....
here కొంగ-boy, చేప-girl...
చేప కొంగను గుడ్డిగా ప్రేమించి బయటికి వస్తే కొంగకు ఆహారం కావాల్సిందే.
అలాగే కొంగ చేపను ఘాడంగా ప్రేమించినా నీటిలో మునిగి ప్రాణం వదలాల్సిందే...
friends , pls forgive me if I say anything wrong...
last but not least... marriages are made in heaven...
176)
ఎందుకు నీకీ మౌనం,
నీకై ఎదురుచూసే నాపై ఎందుకు నీకీ చులకన..
నిన్ను లేపే పొద్దుపొడుపు సూర్య కిరణాన్ని నేను కాననా..
నిన్ను మైమరపించే పువ్వును నేను కాననా..
నిన్ను ప్రేమతో తడిపే నీలిమేఘపు జల్లును నేను కానా..
నిన్ను గమ్యం చేర్చే బాటను నేను కాననా..
నీ శ్వాశలో ఆశను నేను కాననా..
నీ కనుపాపలో కలను నేను కాననా..
వెన్నెలలో నీ యదపై ఒదిగే చెలిని నేను కాననా..
నిన్ను నిదురలోకి జార్చే జోలపాటను నేను కాననా..
నీ చిలిపి పలకరింపుకై ఎదురుచూసే చిట్టి చిలకమ్మాపై జాలి లేదా..??!!
26/1
175)
మా ఇంటి పూల కుండీలో పెంచాను ఒక గులాబి మొక్క..
రొజూ పోస్తున్నాను నీళ్ళు, చూడాలని అందమైన గులాబి పూలు..
పెరుగుతున్నది ముళ్ళ పొద, వేచి వున్నది నా యద,
కొమ్మ కొమ్మకు మొగ్గ తొడిగి, గుభాలించే పూలు పూస్తాయని..
అందమైన గులాబి పువ్వువై వస్తావో..??
ముళ్ళ పొదనే నాకు మిగులుస్తావో..??
26/1
174)
మువ్వన్నెల జండాను ఎగురవేద్దాం
వందేమాతరం అంటూ ముందుకు నడుద్దాం
వందల, వేల మంది త్యాగాలను గుర్తుచేసుకుందాం
రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలను గౌరవిద్దాం
ప్రపంచంలో మన దేశ గొప్పతనాన్ని చాటిచేప్పుదాం..
వందేమాతరం....!!!!
25/1
173)
నేను కన్న కలలు చాలా వున్నాయి,
అందులో ఒక కల,
ఒక మంచి కవిత రాయాలని
అది అందరి జీవితాన్ని తాకాలని..
ఒక మరువలేని చిత్రం గీయాలని
ఆ చిత్రంలో ప్రాణం పోయాలని..
ఒక మధురమైన పాట రాయాలని
ఆ పాటతో మనసు పరవశించాలని..
ఒక గౌరవప్రదమైన ఉన్నతి పొందాలని
అది అందరికి ఆదర్శం కావాలని..
ఒక కలలా అజ్ఞాతంలో అంతమవ్వాలని
అంతమై అందరిలో జీవించాలని..
కల కన్నాను, కంటున్నాను.....!!!!
24/1
172)
కనులు మూసినా నీవే కనులు తెరిసినా నీవే..
కన్నీళ్ళ కడలిలో నీ ఆలోచన అలలలో..
నీట మునిగిన నేను కన్నీళ్లను దాచగలుగుతున్నాను,
కాని ఆపలేకపోతున్నాను..
కడిగిన ముత్యము వలె కన్నీళ్ళ కడలిలో నిలిచి ఉన్నాను..
కష్టాలను కన్నీళ్లను కదలికే అంకితం చేసినాను...!!!
24/1
171)
ప్రేమకు రెండు మనసులు కలవాలి
పెళ్ళికి రెండు కుటుంబాలు కలవాలి
స్నేహానికి మనసులు, కుటుంబాలు కలవాల్సిన అవసరం లేదు..
రెండు calls , రెండు sms లు, రెండు మాటలు, కుదిరితే cup coffee .. అంతే simple
ఇవి చాలు జీవితానికి.. చనిపోయిన శవం కూడా లేచి నడుస్తుంది..
24/1
170)
దూరంగా ఉన్న నీ కనులకు నా కంటి చెమ్మ ఎలా కనపడును..??
మౌనంగా ఉన్న నీ మదికి నా మనోవేదన ఎలా తెలుయును..??
అందని తీరంలో ఉన్న నీకు నా అవరాలు ఎలా తెలియును..??
ఆకాశంలో ఉన్న నీకు నా ఆశలు ఎలా తెలియును..??
అమావాస్య చెంద్రుడివైన నీకు అలిసిన నా కనులు ఎలా కనిపించును..??
చెయ్యి అందుకోలేని నీకు నీ చెలి నిచ్చెలిగా ఎలా మిగులును..??
23/1
169)
నాది కాని జీవితానికి నన్ను బానిసను చేసావు
నన్ను నన్నుగా నచ్చి నాకు నన్ను దూరం చేసావు
నా నవ్వులో దాగిన నువ్వు నన్ను నలుగురిలో కలుపుతున్నావు..
నువ్వున్నావన్న నమ్మకమే నన్ను నన్నుగా నిలుపుతుంది
నన్ను నేను మరిచినా నీపై నా ఆశ నన్ను నాకు గుర్తుచేస్తుంది
నువ్వు నువ్వుగా మెచ్చిన నేను నువ్వే కదా...!!!
22/1
168)
కలల తోటలో విహరించిన నా కనులు అలసిపోయినాయి..
నిన్ను కలవలేనని నా మనసును కలవరపెట్టినాయి..
ఆశల ఎడారిలో అశ్రువులుగా మిగిలాయి..
జీవిస్తున్నాను దేనికీ లోటు లేకుండా,
నిన్ను కలవలేనని తలిసి మనసు భారమై, అన్నీ దూరమై,
అన్నీ ఉన్న పేదరాలినయ్యాను...
ఆశలతో కట్టినాను ఆకాశాహార్మ్యాలు..
నిన్ను కలవలేని నేను అందులో కాలు పెట్టలేను..
ఆశల సౌధాలు ఆనందాన్ని మిగల్చలేదు..
నీ ఉహలే ఉపిరిగా జీవితున్నాను,
నలుగురిలో నన్ను నేను వెతుక్కుంటున్నాను,
రాని నవ్వును పెదవులపై రంగరించి రాణిస్తున్నాను..!!!
22/1
167)
మౌనమే నీ ఆయుదమైతే
నా మనసుకు మరణమే శరణ్యం..
నీ మౌనం తో నా మనసు పోరాడలేదు..
పోరాడినా అది గెలవలేదు..
21/1
166)
కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం..
మరణం తప్పదు అని తెలిసి కూడా జీవిస్తున్నాం..
కాలిపోయే శరీరానికి మెరుగులు దిద్దుతున్నాం..
వెంట రాదనీ తెలిసీ కోట్ల ధనాన్ని కూడపెట్టి,
కనిపించని చూట మూటలు కట్టి మురుస్తున్నం..
దయ, కరుణను మరిచి చెడు చెంతన చేరుతున్నం..
మంచిని మంచులా కరిగించి మనిషికి దూరం చేస్తున్నాం..
సహజత్వాన్ని మార్చిన కృత్రిమ మార్గాలను వెతున్నం..
కల్మశరహిత మనసులో ద్వేషాన్ని నింపుతున్నాం..
నలుగురిలో నిన్ను నువ్వు వెతుక్కునేలా చేసుకుంటున్నాం..
సభ్యతా సంస్కారాలను నవ్వుల పాలు చేస్తున్నాం..
తరతరాలు కాపాడుకోవాల్సిన మన జీవిత విధానాన్ని,
మరణిస్తే మరుగున పడేలా చేసుకుంటున్నాం..
మట్టిలో కలిసిపోయే శరీరంపై మమకారం వదలాలి..
బ్రతికిన నాలుగురోజులు గౌరవంగా బ్రతకాలి..
స్వార్థాన్ని సమాధి చేసి నలుగురికి ఉపయోగపడాలి..
మానవ సమాజానికి బాసటగా నిలవాలి....!!!!
21/1
165)
జీవితం అనే ప్రమిదలో
ఆశలు అనే నూనె పోసి
ఆశయం అనే వొత్తి వేస్తే
దేదీప్యమానంగా వెలుగుతుంది జీవన దీపం....!!
ఆశలు అనే నూనె లేకపోతే
ఆశయం అనే వొత్తి కాలిపోతుంది
ఆశయం లేని జీవితం వ్యర్థమే కదా...!!
20/1
163)
నేను, నాది, నాకు అనే పదాలు స్వార్థానికి పర్యాయపదాలు..
మనము, మనది, మనకు అనే పదాలు స్వార్థానికి వ్యతిరేకపదాలు..
స్వార్థం నిండిన మనసు ఎన్నటికీ ఒంటరే..
'నేను' అనే పదంలో కలవని 'పెదవులు',
'మనము' అనే పదానికి కలుస్తాయి..
కలిసిన పెదవులకే కదా ముద్దు ముచ్చట..!!!
20/1
162)
చీకటిని తరిమికొట్టి వెలుగును పంచే సూర్యకాంతికై
........ఎదురుచూస్తున్న ప్రొద్దుతిరుగుడు పువ్వునై,
వాన జల్లులో తడిసిన పూమోగ్గనై,
మంచు బిందువులు నిండిన వికసించిన పువ్వునై,
వసంతంలో చిగురించిన కొమ్మనై,
కోటి ఆశలను మూట కట్టి,
అలలా పొంగుతూ నీ అరచేతిని అందుకోవాలని,
కొలనులో విహరించే హంసనై......ఎదురుచూస్తున్నా..!!
18/1
160)
కలిగెను మదిలోన ఒక కమ్మని భావము
కదిలెను కలము కవి గారి చేతిలోన..
రాసెను మనసుకు తాకే కవితా మాలికలను,
అవి కవితలు కావు మనసును దోచే మధుర గీతికలు..
17/1
159)
నీ మనసులోని మాట విని మైమరిచిపోయాను..
మమతానురాగాల వాకిట నిలిచి ఉన్నాను..
కలిసిపోవాలని కలలు కంటున్నాను..
కాటుక దిద్దిన కనులు వేచి చూస్తున్నాయి..
మదిలో వెయ్యి కొవ్వొత్తులు వెలిగినాయి..
కాటుక కరిగిపోతుందేమో అని,
కొవ్వొత్తులు కరిగిపోతాయేమో అని,
నాలో కలుగుతున్న అలజడికి అంతం లేదా...??
వేచి ఉన్న కాటుక కనులు నిదురలోకి జారెను..
నిదురించిన కనులలో కలవై వచ్చావు..
బిగి కౌగిలిలో నన్ను బందించావు..
నిన్ను చూడాలని ఆరాటపడిన నా కనులు,
తెలియకుండానే విచ్చుకున్నాయి..
కాటుక కనులపై ముద్దాడి కనుమరుగయ్యావు..
కలలోనైనా కలిసుంటావంటే, శాశ్వతంగా నిదురిస్తాను..!!
16/1
158)
ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు
ఏ పువ్వు చూసినా నీ నవ్వే కనిపిస్తున్నది..
చేమంతిలో నీ చల్లని చూపు కనిపిస్తున్నది..
మల్లెలో నీ మంచి మనసు కనిపిస్తున్నది..
మరువంలో మరువలేని నీ అభిమానం కనిపిస్తున్నది..
సంపంగిలో నీ సొగసైన మాటలు కనిపిస్తున్నాయి..
కనకాంబరాలు నీ కను సైగలను గుర్తుచేస్తున్నాయి..
సువాసన వెదజల్లే ప్రతీ పువ్వు నీ జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి...!!!
16/1
157)
నిన్ను చేరుకోవాలి అని ఆరాటపడిన నా రూపాన్ని
అద్దం నన్ను పదే పదే సవరించుకోమంది..
అందంగా కనపడే నన్ను తేరిపారా చూసుకుంది..
నిన్ను చేరలేక నేనుంటే అద్దం నాపై అలిగింది..
అందమైన నా రూపానికి అరకాసు విలువలేదు అంది...!!
16/1
156)
నిన్ను చూడాలని కలలు కన్న నా కనులు
నిన్ను చూడకనే నీ చిత్రాన్ని వేయగలవు..
నిన్ను కలవాలని మదనపడిన నా మనసు
నిన్ను కలవకనే నీ మదిని చదవగలదు..
నీలో దాచుకున్న బాధను చెప్పకపోయినా
కారుతుంది కన్నీరుగా నా కలువ కన్నులలో..
నిన్ను ఎలా మరువగలను...????
మరువలేని నీ జ్ఞాపకాలతో ముడుచుకున్న నా మనసును
ఎలా ఓదార్చను...????
నీ తలపులతో నా కనులకు కునుకు దూరమాయెను
కునుకు రాని నా కంట కలలు ఎలా కనను..???
కలలోనైనా నిన్ను చూడకపోతే ఎలా జీవించగలను...????
14/1
155)
నిన్న జరిగినదని
నేడు జరుగుతుందని
రేపు జరగబోతుందని
చింతిస్తూ కూర్చుంటే సాధించేది శూన్యం..
మనకు తోచిన విధంగా కృషి చేస్తూ,
ఉన్న అవకాశాలను ఉపయోగించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని
ఉన్నంతలో సుఖ సంతోషాలతో తూలతూగాలని,
మన పూర్వికులు కాలానుగునంగా సృష్టించిన రోజులే మన పండగలు రోజులు..
అదే ఈ రోజు మనం జరుపుకునే పండగ రోజు...
13/1
154)
అమావస్యలో చంద్రుడిని వెతుకుతున్న..
ఎగసిపడే కెరటంలో సుఖ సంతోషాలు వెతుకుతున్న..
కాలిపోయే కట్టెలో సుగంధాన్ని వెతుకుతున్న..
రాలిపోయే పువ్వులో మకరంధం వెతుకుతున్న..
మూగపోయే గానంలో సరిగమలు వెతుకుతున్న..
గమ్యం లేని దారిలో ముగింపును వెతుకుతున్న..
13/1
153)
ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితిలో
చేతికందిన పంటను కోల్పోయిన రైతన్న బాధలో
సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్న తెలంగాణా ప్రజల మనోవేదనలో
నియంత్రణ లేని జనాభా పెరుగుతున్న తరుణంలో
తగ్గుతున్న మానవతా విలువల దుస్థితిలో
కనీస వసతులు కూడా లేని అధిక శాతం పేద ప్రజల జీవిత పోరాట సమయంలో
ధరలు పెరిగిపోయి దిగువ, మద్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితిలో
హరివిల్లును గుమ్మంలోకి తెచ్చే సంక్రాంతి సంబరాలు చేసుకోమని నేనెలా చెప్పను....??????
11/1
152)
ఎందుకు ఎందుకు ఈ ద్వేషం ఎందుకు...!!
ఎన్నాళ్ళు ఈ జీవితం, కాదు అది శాశ్వతం
కొన్నేళ్ళ ఈ జీవితం కాకూడదు ద్వేషపూరితం..
ఏమున్నది ద్వేషంలో,
ఏమున్నది పగ ప్రతీకారంలో..
చూపించలేరా కొంత ప్రేమను, పూయించలేరా కొంత చిరునవ్వును..
తెలుసుకోలేరా ద్వేషంతో గెలవలేనిది ప్రేమతో జయించవచ్చును అని..
ద్వేషంతో నిండిన అంధకారంలో జీవించే మనుషులు మనుషులేనా..
ద్వేషంతో మూసుకున్న కనులు తెరవండి, మీ హృదయంలో ప్రేమను నింపండి..
అంటరానితనం ఎందుకు, మనుషులలో అడ్డు గోడలెందుకు..??
ఒకే రక్తం ఉన్నమనలో కులమత భేదాలేందుకు..??
ద్వేషంతో సాధించేది శూన్యం..
ప్రేమతో సాధించేది అనన్యం..
ద్వేషంతో రగలిపోతూ మరణించటం ఎందుకు..??
ప్రేమానురాగాలతో నలుగురి మెప్పును పొందు..
చివరికి మట్టిలో కలిసిపోయే మనకోసం కంట తడి పెట్టి
ఆ మట్టిపై రెండు కన్నీటి చుక్కలు రాల్చేలా జీవించు..
నీదన్నది లేకుంటే, రేపన్నది నీదవుతుంది..
అందరితో కలిసిమెలిసి జీవించు..
అదే జీవితం..
11/1
151)
నటించకుమా నీ మదిలోని ఆశలు నాకు తెలుసు..
కవ్వించకుమా నీ కనులలోని కలలు నాకు తెలుసు..
నవ్వించకుమా నీలో దాగిన బాధ నాకు తెలుసు..
నమ్మించకుమా నీలోని అనురాగం నాకు తెలుసు..
చెయ్యి అందించుమా నీలో నేనున్నానని నీకు తెలుసు..
12/1
150)
నీ చెలిమి వెలుగులో చీకటి అనేది లేకుండా చేసావు..
నా కలలో విహరిస్తూ నాకు నిదురను దూరం చేసావు..
మౌనంగా ఉండే నా మనసును అనుక్షణం నీ పేరే తపించేలా చేసావు..
హృదయం పగిలేలా సవ్వడి చేస్తూ ఊహల్లో నాట్యం చేస్తున్నావు..
నీవు లేకుండా నా జీవితం ఇక సాగాదేమో అనుకునేలా చేస్తున్నావు..
నీవు నాకు లేవు అని తెలిస్తే ఇక నేను లేనేమో అనుకుంటున్నాను..!!
10/1/11
149)
కొత్త ఆశలతో సరికొత్త ఊహలతో అతవారి ఇంట కాలు పెడుతుంది కొత్త కోడలు..
కోటి కలలతో అడుగుపెట్టిన కొత్త కోడలును కాసుల కోసం కడతేర్చటం న్యాయమా..???
కష్టపడి సంపాదించి కట్టుకున్న వారిని పోషించలేని స్వార్థ సోమరిపోతులు కోరుకునేదే కట్నం..
కట్న పిశాచి కోరలకు బలవుతున్న కొత్త కోడళ్ళ కన్నిటికి కట్టలు వేయలేమా...
కొత్త పోకడలతో కొవ్వేక్కిన మగ మదంతో
తోడుగా ఉండాల్సిన మొగుడు కాల యముడైతే
కలికి చిలకల కొలికి కాటికి దారి వెతుకుతూ
నిండు నూరేళ్ళ జీవితానికి నిప్పు పెర్చుకోవలసిందేనా...??
కమ్మగా సాగాలసిన కాపురానికి కన్నీటి వ్యద తప్పదా..??
నిజానికి ఈ కన్నీటికి కారణం కట్నమేనా...???
కలవని మనసులకు కుంటి సాకు అవుతున్నదా..???
ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో జరిగి
కన్న వారికి కట్టుకున్న వారికి అన్యాయం చేయటం న్యాయమేనా...??
Note : క్షమించండి, ఇది అందరిని ఉద్దేశించినది కాదు... నా friend NRI కట్న పిశాచానికి బలయిపోయింది...
7/1/11
148)
కమ్మనైన నీ పలుకులతో చేమ్మరిల్లెను నా కనులు
ఆనంద కేరింతలతో ఊయలూగెను నా మనసు..
నాకు తెలియకుండానే నీ ఊసులు నా ఉపిరాయేను
నీకు ఎలా తెలుపను భారమైన నా శ్వాస ఘోషను..
అల్లరి చేసే నా మనసుకు అలుపులేకుండా పోయెను
కలలా మారకూడదు నీ వలపుల హొయలు..
సొంతమవ్వాలి నా ఊహల హరివిల్లు
సంతోష పెట్టాలి నీ మనసును వందేళ్ళు..!!
...
బాధపడకు నేస్తమా,
శిలను శిల్పంగా మార్చే చిరంజీవుడు వస్తాడు
నీ బాధలను తుడిపేసి కొత్త ఆశలను నింపుతాడు...
ఆశ లేనిదే జీవించటం చాలా కష్టము
కడదాకా జీవించక తప్పదు...
6/1/11
147)
ప్రేమ మదిలోని ఒక మధుర భావము..
మనిషి జీవిత కాలంలో ఒక ముక్యమైన భాగము..
నిజమైన ప్రేమను పొందటం ఒక అద్బుతము..
ప్రేమ అనేది రెండు శరీరాలు కలవటానికి కాదు..
చిన్న వయసులో తల్లి తండ్రుల ప్రేమను,
తరువాత అక్క, చెల్లి, అన్న, తమ్ములు,
ముఖ్యంగా స్నేహితుల ప్రేమను,
యుక్త వయసులో ప్రేయసి/ప్రియుని ప్రేమను,
తనువాత జీవిత భాగస్వామి ప్రేమను
(అదృష్టం వుంటే ప్రేమికులే భాగస్వాములు అవుతారు),
మలి వయసులో పిల్లల ప్రేమను,
వృద్ధాప్యంలో మనుమల ప్రేమను కోరుకుంటాడు ప్రతి మనిషి..
ఇది ప్రకృతి సహజమైన అవసరము..
సమాజం అభివృద్ధి చెందుతున్న తరుణంలో
నేటి యువత తనకు అందివచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తూ,
ప్రేమను అపహాస్యం చేస్తున్నారు..
తోటి వారికి హాని కలిగిస్తున్నారు..
మానవతా విలువలను మంట కలుపుతున్నారు..
పబ్బులు, బార్లు, drugs, అశ్లీలతకు మొగ్గు చూపుతున్నారు..
ధనికులే కాదు, పేద యువతకు కూడా ఇందుకు మినహాయింపు లేదు..
అబ్బాయిలు/అమ్మాయిలు ఆకర్షణకు లోబడి అన్యాయం అవుతున్నారు..
ప్రతి మనిషికి ఒక మనసు వుంటుంది..
ఆ మనసుకు ఒక హక్కు వుంటుంది..
ఆ హక్కుతో మనసును ఎవరికైనా ఇచ్చి పుచుకోవచ్చు..
అది ప్రేమ అని కొట్టిపారేయవద్దు ..
ప్రకృతి సహజము, అది జీవితావసరము అని మరువద్దు.!!.
హద్దులు మీరకుండా,
జీవితాశయ దిశగా సాగిపోతూ,
ప్రకృతి సహజమైన ప్రేమను గౌరవిస్తూ,
ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని సాధించి,
సమ సమాజాన్ని స్థాపించి,
కుటుంబాభివ్రుద్దికి, దేశాభివ్రుద్దికి పాటుపడటం
యువత చేతిలో వుందనేది మనం ఎన్నటికీ మరువద్దు..!!
4/1/11
146)
నా మదిలో దాగిన మధుర వేదనా
నీలో నన్ను చేర్చుకోనుమా..
నా కనులలో నిలిచిన కన్నీరును
పన్నీరు చేయుమా..
కమ్మని నీ మదిలో తీయని భావంలా
నన్ను మల్చుకోనుమా..
వెచ్చటి వొడిలోన వొదిగే చంటి పాపలా
నన్ను సేదతీరనీయుమా..
కోరికల వలలో చిక్కిన నా మదిని
విడిపించుమా..
కొండంత ఆశతో, కొంగు బంగారం అవుతుందని
కష్టపడి పసిపాపలా పెంచుకున్న
పచ్చని పంట పొలాలు ప్రకృతి భీబస్తంతో వరద పాలయి
నీట మునిగినాయి పేద రైతు పంచప్రాణాలు..
పావలా పైసతో పనికి రాని సాయం చేస్తామంటూ,
పరుపులు పరుచుకొని పది రోజుల దీక్షలు చేస్తూ,
లక్షల ఖర్చుతో లక్ష్య దీక్షలు చేస్తూ,
పాడిందే పాటగా పనికి రాని వాగ్దానాలు చేస్తూ
పబ్బం గడుపుకునే నేతల నుండి
పేద రైతుకు విముక్తి లేదా..????
పటిష్టమైన ప్రమాణాలతో కూడిన పధకాలను
ఆచరణలో పెట్టలేని ప్రభుత్వం పని తీరుకు
బలైన రైతన్నకు మోక్షం లేదా..??????
29/12
144)
చల్లటి చలిని కాచే వెచ్చటి ఉషోదయంలా వస్తాను
తీగలా నిన్ను అల్లుకొని నీ మదిలో వికసించిన
పువ్వులా ఆనంద రాగాలు పలికిస్తాను..
వసంతాన కూసే కోయిల రాగమై
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే కిల కిల రావం అవుతాను..
చిలిపి చేష్టలతో నీలో మధుర భావాలను
పలికించి హాయిగొలిపే పసిడి బొమ్మ నేనవుతాను...
29/12
143)
అమ్మ లేని లోటును మరువక
అమ్మ పిలుపుకు నోచుకోక
నోట మాట రాక
కంట తడి ఆరక
ఆవేదన తరగక
గుండె బరువై
మనసు చేరువై
మమతల వాకిట నిలిచి దేహీ అనినా
ఆ దేవుడు కరుణించడు కదా...
తిరిగి రాలేని లోకంలో అమ్మను భందించెను కదా..
బాధపడకు నేస్తమా
నీ తప్పుకు చింతించకు
దేవుడు అమ్మకు ఇచ్చిన వరం
కన్న బిడ్డలను క్షమించటం....!!!
29/12
142)
చీకటి తెలియని చిన్నారి వయసులో
చిరిగిన బట్టలతో, చింపిరి జుట్టుతో
బాల్యాన్ని మరచి చిన్ని పొట్టకై
చిల్లర కోసం చీత్కారాలు తింటూ
road నే బడిగా చేసుకొని
జీవిత పాఠాలు నేర్చుకుంటూ
దేశానికి ఉపయోగపడే చిట్టి మేధావులు
చేత్తకుప్పలే ప్రపంచంగా బతుకుతూ
చెదిరిన జీవితాలతో, చెడు వ్యసనాలతో
దేశ గౌరవాన్ని నిలపెట్టాల్సిన రేపటి పౌరులు
భూమికే భారమవుతున్నారు..
వందల కోట్ల అక్రమార్కులకు కనపడయెందుకు
ఈ చిన్ని జీవితాలు...???????
27/12
141)
ఓ మనసా మౌనమెందుకే...?!
ఊరు నిద్దరోయే వేల నా మనసు
విహంగమై నిన్ను వెతుకుతున్నది...
విరుపులతో వాలిన నా తనువు
విశాలమైన నీ వదనాన్ని వెతుకుతున్నది..
ఊహలలో ఒంటరైన నా మనసు
నీ తుంటరి పిలుపుకై ఎదురుచూస్తున్నది..
వెండి వెన్నెల వెలుగులో వెళ్లి విరిసిన నా మనసు
నీ వలపుల ఉసులకై వెతుకుతున్నది..
వేదన వీడవే మనసా
నీ మౌనము నన్నువెంటాడుతున్నది
నా మనసును కలవరపెడుతున్నది...!!
27/12
140)
గులాబి పువ్వులాంటి నా జీవితం
గూటిలో పక్షిలా మారింది...
సప్త వర్ణాల ఇంద్రదనస్సులాంటి నా జీవితం,
స్వప్న లోకాలకే పరిమితమయ్యింది..
అగ్ని జ్వలలాంటి నా జీవితం
గుడిలో దీపంలా మారింది..
పరవళ్ళు తొక్కే ప్రవాహంలాంటి నా జీవితం,
కలశంలో తీర్థంయ్యింది..
పచ్చని పంట పొలం లాంటి నా జీవితం,
పెరటి గడ్డిపోచలా మారింది..
నీవు లేని నా జీవితానికి,
అర్థమే మారిపోతుంది....!!!
17/12
139)
చేతిలో చెయ్యివేసి చెప్పకపోయినా
నీ మనసును తట్టి అడుగు ఒక్కసారైనా
నా ఆలోచనల ఊసులు నిన్ను కదిలించావా ఎప్పటికైనా..
నాది కాని ఈ సమయానికి జవాబు ఎలా చెప్పను
నీలో దాగిన నిజానికి ఏమని ప్రశ్న వేయను..
నీటి బిందువులాంటి ఆశలతో నిండిన
ఈ భవసాగరానికి ఆనంద తీరాలను ఎలా వెతకను,
కనపడని గమ్యాన్ని వెతుకుతూ పయనిస్తున్నాను
కనిపించిన గమ్యానికి మార్గాన్ని ఎలా కనిపెట్టను..
కంటి కునుకును కానుకగా ఇమ్మని ఎలా అడుగను....??!!
7/12
138)
చిరు దివ్వె వెలుగులో సాగిపోతున్నాను గువ్వలా..
చిరు అందెల సవ్వడితో నాట్యమాడుతున్నాను నెమలిలా..
చిరు నవ్వు సిరితో విరపూస్తున్నాను పువ్వులా..
చిరు జల్లు వాగులో పయనిస్తున్నాను నావలా..
చిరు గాలి తెమ్మెరలో ఎగిరిపోతున్నాను ఇసుక రేనువులా..
చిరు ఆశల పల్లకిలో విహరిస్తున్నాను నా చిట్టి ప్రపంచంలో..
చిరు కోపము కరిగిపోవును నీ తీయని తలంపుతో పలకరింపుతో...!!
4/12
137)
ఓ ప్రియతమా..!!
రమ్మని నన్ను అడగవలెనా,
వచ్చి వాలిపోనా నీ వెచ్చని వాడిలోన..
స్వాతి చినుకై వస్తాను,
మంచి ముత్యమై నిలిచి పోనా...
మల్లె తీగనై వస్తాను,
పూల కొమ్మనై అల్లుకుపోనా..
మురిపించే మువ్వనై వస్తాను,
సప్తస్వరాల గీతికనై చుట్టుకుపోనా..
తైల వర్ణ చిత్రమై వస్తాను,
పచ్చబోట్టునై అంటుకుపోనా...
రమ్మని నన్ను అడగవలెనా,
వచ్చి వాలిపోనా నీ వేచని వాడిలోన...!!!
4/12
136)
నేస్తమా, నా ప్రియతమా, కనిపించని ప్రణయమా...!!
నా కంటిలో కనపడని తీయని కల నీవు,
నా పచ్చని జీవిత వృక్షానికి కనపడని వేఱు నీవు,
నా సిరి నవ్వుల పువ్వుల దండలో దాగిన దారం నీవు,
నా వలపుల స్వరంలో దాగిన రాగం నీవు,
నా మమతల మేఘంలో దాగిన నీటి బిందువు నీవు,
నిన్ను వెన్నంటి ఉన్న నీడను నేను,
నిన్ను వదలని నేలను నేను...!!!
14/11
135)
కనిపించక కలవరపెడుతున్నావు,
కలలో నీవు అలరిస్తున్నావు,
నా కవితకు ప్రేరణనిస్తున్నావు,
కమ్మని నా ఊహలో నిలుస్తున్నావు,
తెలియకనే చేరువవుతున్నావు,
మదిలోన చెదరని చిత్రమవుతున్నావు,
పెదవులపై చిరునవ్వువవుతున్నావు,
తనువులో పులకరింతవవుతున్నావు,
మరపురాని మధురిమవవుతున్నావు,
చిలిపి తలపులకు చిరునామావవుతున్నావు...
14/11
134
మనసులో కలుగుతుంది ఒక మధుర భావన,
పెదవులు పలకలేని తీయని రోదన..
చెప్పినా తరగని తీరని ఆవేదన..
ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఇక్కడ కలిసాము..
తెలియని ఈ తీయని బంధానికి తెరవేయలేను..
చేరలేనని తెలిసి దూరమవ్వలెను...
4/11
133)
నిదురపోయే వేళ నిను తలచి నిదుర మరచి
నీ పలుకుకై నా మది వేచి ఉండెను..
కోడి కూసే వేళ కునుకు చాలక
కంటి కాలువలు విచుకోనక కష్టపడెను...
4/11
132)
ఏ జన్మ బంధమో కలిసితిమి ఈ జన్మలో
దరి చేరలేను, దూరమవ్వలెను..
భరించలేను నీ మౌనము,
సహించలేను ఈ దూరము..
కొండకోనల నడుమ నేను నిలిచినా,
కొదమ సింహానికైనా భయపడని నన్ను,
కలసిరాని కాలమే కాల సర్పమై వణికిస్తుంది..
కటినమైన నీ నిర్ణయానికి కారణాలు తెలియక,
కరుణించని ఆ దేవుడిని అనుక్షణం పూజిస్తూ,
మూడునాళ్ళ ఈ జీవితాన్ని ముడుపు కట్టినాను..
మురిపించే నీ తీయని పిలుపుకై వేచి వున్నాను...
27/10
131)
నేస్తమా ప్రియతమా నాలోన నిలిచిన మౌనమా ..??
నీ నిరీక్షణలో, నీరుగా నిలిచెను నా కంటిలోన
నీకై కన్న నా తీపి కళలు..
నీ నిరీక్షణలో, మౌనమై వేచివుండెను నా మదిలోన
నీకై పాడుకునే మోహన రాగము..
నీ నిరీక్షణలో, మేఘమై మిగిలెను నింగిలోన
నీకై దాచిన నా చిరునవ్వుల చిరుజల్లులు..
నీ నిరీక్షణలో, ఆవిరవుతున్నవి నాలోన
నీకై ఎగసిపడే వలపుల జ్వాలలు
నీ నిరీక్షణలో, శిలగా మారెను నిలువుటద్దంలో
నీకై గీసిన నా రూపము..
నన్ను ఇంకా పరిక్షించకు నేస్తమా నా ప్రియతమా దరి చేరుమా...!!!
23/10
130)
నన్ను వదిలి వెల్లకుమా..
నీ హృదయమంతా నేనై ఉంటా అనుకున్నాను,
నన్ను హృదయమే లేని దాన్ని చేసావు...
నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను,
ఎన్నటికి నన్ను కలవని నీడవయ్యవు..
నాకు పౌర్ణమి వెన్నెలవవుతావు అనుకున్నాను,
నేనే అడవి కాచిన వెన్నెలనయ్యాను..
నా చేయి పట్టుకొని చేరదీస్తావు అనుకున్నాను,
చెదిరిన గూడై మిగిలాను..
భావ సాగరాన్ని ఆనందంగా దాటేయ్యాలనుకున్నాను,
నడి సముద్రంలో నావనయ్యాను...
నా కొరకు నీవు ఎదురుచూస్తావు అనుకున్నాను,
మరు భూమికి మార్గం వెతుకుతున్నాను....
నన్ను వదిలి వెల్లకుమా..!!
22/10
129)
చిరు గాలి సవ్వడి నా మది తలుపు తట్టింది..
చిరు పలుకులకే నా మది పులకరించింది..
చిట్టి సందేశము చాలు నా చిరునవ్వుకి..
చిరకాలం కోరుకుంటుంది నా ఈ చిన్ని మనసు..!!
18/10
128)
అలుకెందుకే మనసా
తెలుసుకోలేవా నా మది ఆవేదన..
మౌనమెందుకే మనసా
తెలుసుకోలేవా నా మూగ మనసు ఆక్రందన..
కోపమెందుకే మనసా
తెలుసుకోలేవా నాలోని ఆరాధన..
తెలుపవా నాకు నీ అభినందన..
నిను విసిగించే నా తీరని బాధని..
తెలిసి వలచిన మనసా
మన ఆవేదన అరణ్య రోదనే కదా..!!
17/10
127)
తొలి పొద్దు సూర్య కిరణానికై ఎదురుచూసే పూమొగ్గలా,
రేయికై ఎదురుచూసే నక్షత్రంలా,
మఘమాసానికై ఎదురుచూసే సన్నాయిలా,
సంక్రంతికై ఎదురుచూసే రంగుల రంగావల్లిలా,
దీపావలికై ఎదురుచూసే కాకర పువ్వోత్తిలా,
కరిగిపోతున్నాను వెలుగునిస్తూ కరిగిపోయే కొవ్వొత్తిలా నీకై ఎదురుచూస్తూ...
126)
పయనించే గాలిని అడిగా నీ చిరునామా ఏదని,
పారే సెలయేరుని అడిగా నీ జాడ తెలుపమని,
ఆకాశం కట్టిన నల్ల చీరపై వెలిగే వెండి తారలను అడిగా నీ నివాసం ఎక్కడా అని,
అన్ని ఒక్కటే చెపుతున్నాయి, నీ కలలో నాతో విహరిస్తున్నవని...!!
16/10
125)
ప్రేమ అందమైనది, దాని పుట్టుక ఎవరికీ అందనిది..
ప్రేమించిన వారి ప్రేమను పొందటం అదృష్టం..
ఆ ప్రేమతో కలిసి పయనించే జీవితాన్ని పొందటం జన్మ జన్మల పుణ్యం...
ఇది అందరికి సాధ్యపడదనేది జగమెరిగిన సత్యం..
ప్రేమకు పెళ్లి గమ్యం కారాదు,
పెళ్ళికి ప్రేమ పునాది కావాలి..
ప్రేమ అనేది మనసుకు, మధుర భావాలకు, తీయని ఊహలకు శాశ్వత నిలయం..
పెళ్లి అనేది మట్టిలో కలిసిపోయే శరీర సంభందం..
ఆ ప్రేమ ఈ పెళ్లి కలిసిన ఆమోదయోగ్యమైన జీవితం అపురూపం..
నాలోన దాగిన కవితా సరాగాలను తట్టి లేపిన నీవు
నాలో ఉంటూ నను నడిపిస్తున్నావు..
కలిసి పయనించే దారికి కంచె వేసెను కదా అదృష్టము
కమ్మని కలలే కదా జీవిత సమరానికి పూల బాటలు...
నీ మదిలోన నా స్థానము రాతి మీద చెక్కిన తీపి రాతలు,
నిను బాధించే నా తలపులు ఇసుకలో రాసిన పిచ్చి గీతలు..
నన్ను నన్నుగా ఇష్టపడిన నీవు మరిచిపోలేని మమతాను రాగము,
మనసులోన నిలిచి పోయెను మోహన మురళి గానము..
12/10
123)
చిలకా పలకవా
పంచవన్నెల చిలకా పదిలమా
పంచదార చిలకా కోపమేల
పన్నీరు గిలకా తాపమెల
పసిడి పూవుపై అలుక ఏల
పట్టుతేనే మొలకా పలుకులు కరువా..???
6/10
122)
నా అనుకున్న నువ్వు నాలో ఉంటూనే నన్ను దూరం చేస్తున్నావు..
నీ అని చెప్పుకున్న నేను నీలో చేరలేకపోతున్నాను..
చేరువ కాని జీవితం చెరసాల కంటే ఖటినం..
చెదిరిన కలకు నీ రూపం కాకూడదు ప్రతిరూపం...
ఏ తీరాన వున్నా నిన్ను చేరటమే నా తుది శ్వాస లక్ష్యము..
అది ఈ జన్మలో కాకపోయినా మరుజన్మలో కలుచుట తధ్యము...
30/9
121)
నీకు తగని జాజి మల్లిని,
దూరాన పూసిన కొండ మల్లిని,
చేతికందని గుండు మల్లిని,
పరిమళానికే పరిమితమైన అడవి మల్లిని,
చూపులకందని చిట్టి మల్లిని,
మాటలకే మురిసిపోయే సిరి మల్లిని....!!!
29/9
120)
కరిగిపోతున్నది జీవితం, కన్న కలలను దూరం చేస్తూ..
కనుమరుగవుతున్నది జీవితం, నా తపనను కన్నీరుగా మారుస్తూ..
నిస్సారంగా మారుతున్నది జీవితం, పచ్చని ఆశలను ఆహుతి చేస్తూ..
భారమవుతున్నది జీవితం, మధుర భావాలను భూస్థాపితం చేస్తూ..
క్షణం ఒక యుగమవుతున్నది జీవితం, నా ఆనందాన్ని క్షణికం చేస్తూ....
23/9
119)
తెలవారితనే వెలుగు, చీకటిలో ఎందుకు పరుగు??
వేదనలేని బతుకు, సంతోషానికి తుది మెట్టు...
23/9
118)
తీరం చేరలేని కెరటమా అలుపెందుకే??
గమ్యం చేరుటకు వెతుకు దారులు అలుపెరుగక...
23/9
117)
ప్రియతమా,
కదలని నా కాల రథానికి చక్రానివై కదిలించుమా..
నడవని నా జీవిత నావకు చుక్కనివై నడిపించుమా..
మూగబోయిన నా మనసు పాటకు పల్లవివై పలికించుమా..
విరపూయని నా ఊహల తోటలో ముత్యపు జల్లువై కురుయుమా..
కాంతి లేని నా ఆశల కిరీటంలో కలికితురాయివై(precious stone) నిలిచిపోవుమా..
26/8
116)
కంటిలో కరగని నలుసు కన్నా,
కారిపోయే కన్నీరు మంచిది...
దాహం తీర్చని సముద్రాని కన్నా,
తీరం వదిలే కెరటం మంచిది...
మెలకువలోను ఒక కలగా మెదలడం కన్నా,
వేకువను వదిలే చీకటి మంచిది...
నీటికి ఆరని అగ్నిజ్వాల కన్నా,
చిరు జల్లులు కురిసే మేఘం మంచిది...
కలల మేడను కట్టడం కన్నా,
శిధిలమైన పూరి గుడిసె మంచిది....
కలిసిరాని కాలానికి కన్నీరే పన్నీరవుతుంది...!!!
25/8
115)
నువ్వస్తానంటే, నన్ను నేను వదిలి
నీలో నన్ను వెతుక్కుంటున్నా...
నువ్వస్తానంటే, నా కల నన్ను వదిలి
నీ కనులను వెతుకుతున్నది...
నువ్వస్తానంటే, నా మది ఆశను వదిలి
నీలో నా శ్వాశను వెతుకుతున్నది...
నువ్వస్తానంటే, నా తనువు నన్ను వదిలి
నీ తనువులో నివాసాన్ని వెతుకుతున్నది...
నువ్వస్తానంటే, నా విరహం నన్ను వదిలి
నీ ప్రేమకు పూల హారం అవుతానంటున్నది.....!!!
23/8
112)
పరుగెత్తే మనసు పరవశించును నీ పలుకునకు...
మౌనము గానమై పాడును మోహన రాగము...
వెను తిరిగి చూచును గడిచిన మధురమైన కాలాన్ని...
వెన్నెలను కాగడాగా చేసి వెతుకును వెన్నెలాంటి మనసుకై...
కటినమైన గడియలు కరిగిపోవును తక్షణమే...
క్షణమైనా మౌనానికి అధికారమీయకూడదని
కలకాలం కోరుకుంటుంది.....!!!!
22/8
113)
ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు,
ప్రేమంటే పెదాలు సైతం పలకలేని మదుర భావాలు......
17/8
111)
కెరటానికి తెలుసా కన్నీటి విలువ..??
మేఘం వానై కురిసినా ఆకాశం తడుస్తుందా ..??
తొలి పొద్దు మంచు బిందువు కమలంపై నిలుచునా..??
ఎడారిలో కురుయునా వలపుల జడి వాన..??
కన్నీటి దారలు వరదై పారినా,
చెరగని చిరునవ్వే కదా తరగని ఆభరణం....!!!
13/8
110)
ఎదురుచూస్తా నీ రాకకై.....!!!
కెరటానివై వస్తానంటే తీరమై ఎదురుచూస్తా,
గాలివానవై వస్తానంటే ఎండిన నేలనై ఎదురుచూస్తా,
పౌర్ణమి చంద్రుడివై వస్తానంటే వెలుగు లేని చీకటినై ఎదురుచూస్తా,
పంచావేన్నెల రామచిలకవై వస్తానంటే గున్న మామిడి చిగురునై ఎదురుచూస్తా,
కలువ పువ్వువై పూస్తానంటే నీటి మడుగై ఎదురుచూస్తా,
కోయిల గానమై వస్తానంటే వసంత ఋతువై ఎదురుచూస్తా,
గుడిలో దేవుడిలా నిలిచివుంటానంటే నా గుండెలో గుడిసె వేసి ఎదురుచూస్తా....
ఎదురుచూస్తూనే వుంటా నీ రాకకై...!!!
మనసున్న మారాజుకు మమతానురాగాలు కరువా???
మాటేరాని నా మనసుకు పాటలు నేర్పటం తగునా???
మంచి జీవితం కొరకు మరుజన్మకైనా ఎదురుచూస్తాను,
మరువకుమా అందరు వున్న ఈ అనాదను....
1/8
109)
ప్రాణమైన గాలి నా కంటికి కనపడదు,
రూపం లేని ఆ గాలి నా కన్నీళ్లు, కష్టాలు తీర్చగలదా..???
మనసులో మనసైన నా స్నేహితుడు
నా మమతల సామ్రాజ్యానికి రారాజు కాగలడా..???
క్షణికమైన సుఖానికి బానిస కాలేను
క్షమించి మన్నించుమా నా ప్రియ సఖుడా......
1/8
108)
గాయమైన వెదురు రాగాలు పలుకుతుంది,
బాధపడిన హృదయం మౌనమై రోదిస్తుంది,
అశాశ్వతమైన జీవితంపై మమకారమెందుకు,
సుఖసంతోషాల కొరకు పరుగులేందుకు,
ముగిసిపోయే జీవితం నలుగురికి ఆదర్శం కావాలి,
మూడునాళ్ళ ముచ్చటకు స్వస్తి పలకాలి...
కాదు ఇది వేదాంతం
ఇది మానవ జన్మకు పరమార్థం...
28/7
106)
అన్నిటినీ మించినది ప్రేమ బంధం
అనుక్షణం ఆరాదిస్తుందీ బంధం
ఒకరికోకరుగా నిలుస్తుందీ బంధం
ఒంటరి అయితే భరించలేనిదీ బంధం
మదిలోన ఒదిగి పోయేదీ బంధం
మమతానురాగాలకు మూలం ఈ బంధం
మనసున మనసై జీవిస్తుందీ బంధం
బ్రతుకున బ్రతుకై జీవించాలీ అనుకుంటుందీ బంధం....!!!
28/7
105)
విరిగిన కొమ్మ చిగురించదు అని తెలుసు,
విరపూసిన పువ్వు రాలిపోవును అని తెలుసు...
రాయిలా మారిన మనసు కరగదు అని తెలుసు,
మరలరాని ఈ జీవితానికి ప్రేమ కరువు అని తెలుసు...
మమతాను బంధము నాది కాదు అని తెలుసు,
మదిలోని బాధను సమాధి చేయలేను అని తెలుసు...
అన్నీ తెలిసిన నేను ఎలా జీవించగలను...????
27/7
104)
కలిసి కట్టుగా వుండే స్నేహం, రైలుతో సమానం...
బోగీల మధ్య వున్న బంధంలా స్నేహ బందం వుండాలి...
బోగీలు మారవచ్చు, కొత్తవి చేరవచ్చు ,
వాటి మధ్య వున్న గట్టి బంధంతోనే కదా రైలు ప్రయానించేది...
జీవితం అనే రైలుకు, బోగీల వలె వున్న స్నేహితులు ఎంతో ముఖ్యం....!!!
27/7
103)
కనిపించని ప్రేమను కన్నీటితో పూజిస్తిని,
కరునించకపోయినా ఆ మనసుకు భాక్తురాలినైతిని,
కలిసిరాని కాలానికి దాసినైతిని,
కదలని సమయానికి అలవాటుపడితిని,
కాలం కడలిలో కలిసిపోవుటకు సిద్దమైతిని...!!!
25/7
102)
మాటలు కలిపి, మమతలు కురిపించి,
ఆశలు రేపి అనాదను చేయటం న్యాయమా???
తీరని బాధలు, తీర్చలేని కోరికలు,
తిరిగిరాని జీవితానికి బహుమతిగా ఇవ్వటం భావ్యమా???
నన్ను నన్నుగా ఇష్టపడి, నాతో ఆనందమును కోరి,
నన్ను మురిపించి నడి సముద్రములో ఆనందంగా జీవిన్చామనటం ధర్మమా???
కంటికి రెప్పలా చూసుకుంటావని, కన్నీరు దరిచేరనీయవని,
కలకాలం కలిసి జీవిస్తానని కన్న కలను కలగానే ముగించటం నీకు తగునా???
24/7
101)
చేరలేని గమ్యం కోసం పూల బాట వేస్తున్న,
పూలు నన్ను చూసి జాలి పడుతున్నాయి...
కరుణించని ప్రేమ కోసం కన్నీరు కారుస్తున్నా
కన్నీరు నన్ను చూసి ఓదారుస్తుంది...
దరి చేరని మనసు కోసం మమతల పల్లకీని తయారు చేస్తున్నా,
పల్లకి నన్ను చూసి గేలి చేస్తున్నది...
వసంతం లేని జీవితంలో కోకిల పాట కొరకు ఎదురుచూస్తున్న,
వసంతం నన్ను వెక్కిరిస్తున్నది...
మూగబోయిన మనసులో మోహన రాగం కోరుకుంటున్నా,
మౌనం నన్ను ఎగాదిగా చూస్తున్నది...
ఎండిపోయిన ఎడారిలో అమృతం కొరకు అన్వేషిస్తున్న ,
ఎడారి నన్ను ఎగతాళి చేస్తున్నది...
సముద్రం ఒడ్డున దొరికిన గవ్వలో స్వాతిముత్యాన్ని వెతుకుతున్నా,
సముద్రం నన్ను చూసి నవ్వుతున్నది....
ఇన్ని అవమానాలతో కూడిన జీవితం వ్యర్థం అని తలుస్తున్నా.....!!!
21/7
100)
చుట్టూ నీళ్ళు వున్నా మంచినీరు దొరకని సముద్రంలో నిలుచున్నా,
మమతానురాగాలు నిండిన మనసు వున్నా మంచి జీవితం పొందలేకపోతున్నా,
అదృష్టానికి దూరంగా జనారణ్యంలో జీవిస్తున్నా,
మరలరాని ఈ జీవితానికి మంచి మార్గం వెతుకుతున్నా,
ఎడారిలా మారిన ఈ జీవితానికి అది సాధ్యమా అని ఆలోచిస్తున్నా...!!!
కలవలేకపోయినా నిన్ను మరిచిపోవటం అసాధ్యము...